- మండలంలోనే ఆదర్శ గ్రామంగా..
- పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
- రంగారెడ్డిజిల్లాలోనే ఆదర్శంగా నిలిచిన గ్రామం
- రూ.40లక్షలతో పనులు
- తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు
- గ్రామంలో విరివిగా మొక్కల పెంపకం..
- పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం
- రూ.90 లక్షలతో మన ఊరు-మనబడి పనులకు శ్రీకారం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. రంగారెడ్డిజిల్లాలోని షాబాద్ మండలం సర్దార్‌నగర్ గ్రామం మోడల్ విలేజ్‌గా మారింది. జిల్లాలోనే ఈ గ్రామం ఆదర్శంగా నిలిచింది. పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ గ్రామంలో అన్ని రకాల పనులు పూర్తి చేశారు. వైకుంఠధామం, కంపోస్ట్‌యార్డు, పల్లెప్రకృతివనం, హరితహారం నర్సరీ తదితర పనులు చేపట్టారు. గ్రామీణ క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగణం కూడా పూర్తయింది. వివిధ రకాల ఆటలు ఆడుకునేలా సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకువచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సర్దార్‌నగర్ గ్రామం పల్లెప్రగతిలో ముందు వరుసలో నిలిచింది. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. ఎకరంన్నర భూమిలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనంలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు.
గ్రామాన్ని సందర్శించిన కేంద్ర, రాష్ర్టాల బృందాలు..
రంగారెడ్డిజిల్లాలోని షాబాద్ మండలం పల్లెప్రగతిలో ఆదర్శంగా నిలిచింది. గత ఏడాది నుంచి ఈ గ్రామంలో పల్లెప్రగతిలో చేపట్టిన పనులను కేంద్ర, రాష్ర్టాల అధికారుల బృందాలు సందర్శించాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానీయాతో పాటుగా ఎన్‌ఐఆర్‌డీ బృందం, మధ్యప్రదేశ్, బీహార్, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్ముకాశ్మీర్ రాష్ర్టాలకు చెందిన వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, శిక్షణ పంచాయతీ కార్యదర్శులు, రంగారెడ్డి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పలుమార్లు సర్దార్‌నగర్ గ్రామంలో పర్యటించి ఇక్కడ చేపట్టిన పనులను పరిశీలించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనంలో పర్యటించిన అధికారుల బృందం ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం చాలా బాగుందని కితాబిచ్చారు. తమ రాష్ర్టాల్లో కూడా పల్లెప్రగతి లాంటి కార్యక్రమాలు చేపడుతామని వివిధ రాష్ర్టాల బృందాల సభ్యులు తెలిపారు.
అందుబాటులోకి తెలంగాణ క్రీడా మైదానం..
గ్రామీణ ప్రాంతాల యువకులకు వివిధ రకాల ఆటలు ఆడుకునేందుకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొట్టమొదటగా షాబాద్ మండలంలోని సర్దార్‌నగర్ గ్రామంలో రూ.8 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం అందుబాటులోకి వచ్చింది. గత నెలలో మంత్రి సబితాఇంద్రారెడ్డి క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నిస్, సింగిల్‌బార్, డబుల్‌బార్, లాంగ్‌జంప్, హై జంప్, క్రికెట్ నెట్ బాల్ ప్రాక్టీస్ వంటి ఆటలు ఆడుకునేలా సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం ఈ క్రీడా మైదానంలో యువకులు నిత్యం వివిధ రకాల ఆటలు ఆడుకుంటున్నారు.
మన ఊరు-మన బడితో పాఠశాలల అభివృద్ధి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ ఏర్పడింది. సర్దార్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మన ఊరు -మనబడి కార్యక్రమం ద్వారా విద్యాశాఖ నిధులు రూ. 37లక్షలు, ఈజీఎస్ నిధులు రూ. 22లక్షలు మంజూరు కాగా, ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ నిధులు రూ. 6.38లక్షలు, ఈజీఎస్ నిధులు రూ. 22లక్షలతో మొత్తం రూ. 90లక్షల నిధులు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించగా, నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అదే విధంగా పాఠశాల ఆవరణలో అమెజన్ అనుబంధ సంస్థ సెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి రూ. 15లక్షల నిధులతో గ్రంథాలయం నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
మా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే గ్రామంలో పల్లెప్రగతిలో చేపట్టిన అన్ని పనులు పూర్తి అయ్యాయి. తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుతో గ్రామ యువకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తమ హయాంలో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు జిల్లాలోనే మోడల్ విలేజ్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
– మునగపాటి స్వరూప, సర్పంచ్ సర్దార్‌నగర్